విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
రాజన్న సిరిసిల్ల :
డిప్యూటీ సీఎం. భట్టి విక్రమార్క మల్లు..
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష
హాజరైన కలెక్టర్ ఎం. హరిత.
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు.బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం పై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు, సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ , ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించగా, జిల్లా కలెక్టర్ ఎం. హరిత హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద ప్రైవేటు పాఠశాల యాజమాన్యం వారి బడులలో చదివే విద్యార్థులను ఎటువంటి ఇబ్బందులకు గురి చేయడానికి వీలు లేదని స్పష్టం చేశారు. విద్యార్థులకు సంబంధించిన ఫీజు ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. కలెక్టర్లు వెంటనే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ యాజమాన్యులతో సమావేశమై విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.సామాజిక బాధ్యతగా భావించి విద్యా రంగం పై ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం క్రమ పద్ధతిలో విడుదల చేస్తుందని స్పష్టం చేశారు. అనంతరం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కలెక్టర్లు జిల్లా విద్యాశాఖ అధికారులు, సంబంధిత అధికారులు సమన్వయం చేసుకుంటూ పాఠశాల యాజమాన్యులతో చర్చించి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. తదనాంతరం కలెక్టర్ ఎం. హరిత మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ 7 ఉండగా, 338 మంది చదువుతున్నారని, అలాగే ఎస్టీ విద్యార్థులకు ఒక స్కూల్ ఉండగా 35 మంది విద్యార్థులు చదువుతున్నారని కలెక్టర్ ఎం. హరిత తెలిపారు. ఆయా విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఇంచార్జి విద్యాధికారి వినోద్ కుమార్, డీఎస్ సీడీఓ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.