శబరిమలలో చోరీపై కేంద్రం జోక్యం చేసుకోవాలి
కేంద్ర మంత్రికి జిల్లా అయ్యప్ప సేవా సమితి వినతి
కరీంనగర్ :
శబరిమల శ్రీ ధర్మశాస్త్ర దేవస్థానంలో బంగారం చోరీ, ఆస్తుల దుర్వినియోగంలో ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు నిబంధనల ఉల్లంఘనలపై తీవ్ర ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ జిల్లా అయ్యప్ప సేవా సమితి సభ్యులు ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. అయ్యప్ప ఆలయ దర్శనంతోపాటు ఆత్మశుద్ధి, విశ్వాసానికి ప్రతీకగా అయ్యప్ప భక్తులు ప్రతి ఏటా శబరిమల యాత్రకు వెళతారాని, 41 రోజులపాటు దీక్ష చేపట్టి ఇరుముడి భారం మోస్తూ అడవుల మధ్య నడుస్తూ, నేలపై నిద్రిస్తామని చెప్పారు. ఆలయంలో బంగారు ఆభరణాలు చోరీ, తప్పుడు రికార్డులు నమోదు చేసి దేవాలయ ఆస్తులు దుర్వినియోగం చెయ్యడం క్షమించరాని నేరమని, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తోందనీ వినతి పత్రంలో పేర్కొన్నారు. 1999లో ఆలయంలో ఉపయోగించిన 1.5 కిలోల బంగారాన్ని “రాగి”గా రికార్డు చేసి ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని ఆరోపించారు. బంగారు కవచాన్ని ప్రత్యేక కమిషనర్‌కు సమాచారం ఇవ్వకుండానే ప్రైవేట్ సంస్థకు తరలించి కస్టోడియల్ ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ విషయం వెలుగులోకి రావడం హైకోర్టు ఆదేశాలపై ఏర్పడిన సిట్ విచారణ తరువాత మాత్రమే జరిగిందని గుర్తు చేశారు. భక్తుల మనోభావాలను, ఆర్ధిక నేరాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. తక్షణమే శబరిమల ఆలయ ఆస్తులపై సీబీఐ పర్యవేక్షణలో ఆడిట్ లేదా సెంట్రల్ హెరిటేజ్ ఆస్తులపై సమీక్ష జరపాలని డిమాండ్ చేశారు. దేవాలయ ఆస్తుల నిర్వహణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయడంతోపాటు బాధ్యులైన ట్రావెన్ కోర్ బోర్డుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అట్లాగే దేవాలయ ఆస్తులను డిజిటల్ పబ్లిక్ ఇన్వెంటరీ సిస్టమ్ ద్వారా నిర్వహిస్తూ కంట్రోలర్ ఆడిట్ జనరల్ నిర్దేశించిన ప్రమాణాలను పాటించేలా చూడాలని సూచించారు. ప్రజాసేవకులు తమ బాధ్యతల నిర్వహణలో విఫలమైతే వారిపైనా చట్టపరమైన చర్యలకు వెనుకాడొద్దని కోరారు. “కేంద్ర సాంస్కృతిక వారసత్వ రక్షణ హోదా కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు కే. పరమేశ్వర్, పి. సత్యనారాయణ, నాగరాజు, సాయన్నలు పాల్గొన్నారు.