పెట్రోల్ బంక్స్ లో సౌకర్యాలేవీ.. సార్.?
మణుగూరు :
-కొరవడిన నాణ్యతా ప్రమాణాలు
-తాగునీరు, మౌళిక సదుపాయాలు కరవు
-అగ్నిమాపక నివారణ యంత్రాలు లేవు
-అధికారుల వివరాలు, హెచ్చరికల బోర్డులు నిల్
-బంకుల్లో ఇసుక లేని బకెట్లు దర్శనం
-పనిచేయని గాలి యంత్రాలు
పెట్రోల్ బంకుల్లో నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ఇక యజమానుల నిర్లక్ష్యానికి సౌకర్యాలు కల్పించటంలేదు. అధికారుల వివరాలు, కనీసం హెచ్చరికల బోర్డులులేనేలేవు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బంకుల్లో ఇసుక బక్కెట్ల సాయంతో మంటలను అదుపు చేస్తారు. కనీసం ఇసుక లేకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని చెప్పవచ్చు. రెవెన్యూ, పౌరసరఫరా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. నాణ్యతా నిర్ధారణకు డెన్సిటీ పరీక్షలకు అవసరమైన ఫిల్టర్ పేపర్ అందుబాటులో ఉంచటం లేదు. పెట్రోలు బంకుల్లో నియమ నిబంధనలు కొరవడ్డాయి. బంకుల్లో కనీస సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలు కొరవడి వినియోగదారులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంకుల యజమానులు వినియోగదారులకు సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. బంకులను పర్యవేక్షించాల్సిన రెవెన్యూ, పౌరసరఫరా అధికారులు బంకులవైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకు ఉదాహరణగా మణుగూరులోని హెచ్ పి బంక్, ఇండియన్ ఆయిల్ బంక్ లను చెప్పుకోవచ్చు.
కేటాయింపులపై నిర్లక్షం:
పోలీసు, అంబులెన్స్, జ్యూడిషియరీ, అగ్నిమాపక వంటి అత్యవసర సేవలందించే ప్రభుత్వ వాహనాలకు నిత్యం పెట్రోల్, డీజల్ను అందుబాటులో ఉంచాలి. కొన్ని చోట్ల స్టాకు లేదంటూ బోర్డులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వీరికి కేటాయించిన ఆయిల్ ను సైతం ఇతర వాహనాల్లో బయటకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు.
డిజిటల్ లావాదేవీల నిర్వహణ
నగదు కొరతను అధిగమించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి పెట్రోల్ బంకుల్లో స్వైప్ యంత్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేశారు. కొన్ని చోట్ల ఈ యంత్రాలు మూలనపడడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. స్థానిక రెవెన్యూ అధికారులు నెలకోసారి బంకులను తనిఖీ చేయాల్సి ఉండగా బంకుల వైపు వెళ్లడమే మానేశారు. మణుగూరు తహశీల్దార్ అద్దంకి నరేష్ ను వివరణ కోరేందుకు చరవాణి ద్వారా ప్రయత్నించగా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు.