అర్జీ దారుల సమస్యలను సంతృప్తి స్థాయి లో పరిష్కారానికి చర్యలు చేపట్టండి
జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి
వై ఎస్ ఆర్ కడప,ఆగస్టు 18(భారత శక్తి):
ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలలో పరిష్కారంలో అర్జీదారులు సంతృప్తి స్థాయిలో పరిష్కారం ఉండేలా చర్యలు చేపట్టాలని త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం సభాభవన్ లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పిజిఆర్ఎస్) లో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తో పాటు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ లు హాజరై ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యత తో నిర్వహిస్తున్నదన్నారు. పి జి ఆర్ ఎస్ లో అందిన పరిష్కారం లో అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలని ఆదేశించారు.అర్జీలకు నాణ్యమైన పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి,అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. అనంతరం అర్జీదారుల నుండి వారు అర్జీలను స్వీకరించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా.. ప్రజల నుండి అందిన విజ్ఞప్తులలో కొన్ని..
1) కాశినాయన మండలం రెడ్డి కొట్టాలకు చెందిన శ్రీమతి పి సుబ్బలక్ష్మమ్మ కండ్రాసుపల్లెకు చెందిన రమా మరియు సోదరులు తన ఆస్తి అయిన ఇల్లు, రెడ్డి మాను వద్ద 1.80 భూమి, కేశాపురం వద్ద 1.00 ఎకరా భూమి మరియు ఇంటి వద్ద 0.90 సెంట్లు స్థలమును ఆక్రమించి ఉన్నారని వారి నుండి తన స్థలము, ఆస్తి విడిపించి న్యాయం చేయాలని పరిష్కార వేదిక నందు అర్జీని సమర్పించారు.
2) కడప చెమ్ముమియాపేట కు చెందిన ఎస్ ఖలీల్ భాష వారికి విచారణ చేయకుండానే వికలాంగుల పెన్షన్ రద్దు చేశారని తనకు తిరిగి పెన్షన్ మంజూరు చేయగలరని కోరుతూ అర్జీని సమర్పించారు.
3) మైదుకూరు మండలం బొండ్లవరం గ్రామానికి చెందిన కె నాగ మునయ్య తన భూమిలో ఫోర్జరీ పత్రాలతో ఇచ్చిన విద్యుత్ కనెక్షన్ తొలగించుట కొరకు ప్రజా సమస్యల పరిష్కారక వేదికలో అర్జీని సమర్పించారు.
4) జమ్మలమడుగు బొమ్మేపల్లి గ్రామానికి చెందిన ఎం రెడ్డప్ప నాయక్ తనకు తల్లికి వందనం పథకం మంజూరు చేయగలరని కోరుతూ ప్రజా సమస్యల పరిష్కారక వేదికలో అర్జీని సమర్పించారు.
5) తొండూరు మండలం మల్లెల గ్రామానికి చెందిన బి చంద్రశేఖర్ రెడ్డి వీరి గ్రామంలోని 4వ రేషన్ షాప్ ను రద్దు చేసే 3వ షాపు కు ఇంచార్జి ఇవ్వవలసినదిగా కోరుతూ అర్జీని సమర్పించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్వో విశ్వేశ్వర నాయుడు, ఎస్డీసీ వెంకటపతి, సాంఘిక సంక్షేమ శాఖ డిడి సరస్వతి, జడ్పీ సీఈఓ ఓబులమ్మ,డిఆర్డీఏ పిడి రాజ్యలక్ష్మి, మెప్మా పిడి కిరణ్ కుమార్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.