అవినీతిపై ప్రశ్నిస్తే అసత్య అరోపణలా..?
యాదగిరిగుట్ట :
అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఖబర్దార్
బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బిఆర్ఎస్ శ్రేణుల నిరసన
బిఆర్ఎస్ పార్టీ పట్టణ సెక్రటరి జనరల్ పాపట్ల నరహరి ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు
అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరి మీద అయినా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాం, ఎంతైనా విమర్శిస్తాం అంటే తాము చూస్తూ ఊరుకోమంటూ బిఆర్ఎస్ యాదగిరిగుట్ట పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు. బుధవారం యాదగిరిగుట్ట పట్టణంలోని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య నివాసంలో స్ధానిక కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ యాదగిరిగుట్ట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, చెప్పలేని రీతిలో దుర్భాశలాడుతూ కర్రె వెంకటయ్య వ్యక్తిత్వాన్ని దెబ్బ తీశారని, సమాజంలో ఆయన పరువుకు భంగం కలిగే విధంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం స్ధానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం పాపట్ల నరహరి మాట్లాడుతూ బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్యపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అధికారం ఉంది కదా నోటికి ఏది వస్తే మాట్లాడతామంటే పడటానికి ఎవరూ సిద్ధంగా లేరని అంతకంతకూ బదులిస్తామన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చిపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, కర్రె వెంకటయ్య అసభ్య పదజాలంతో ధూషించడం తీవ్ర అభ్యంతరకరమని చెప్పారు. స్ధానిక కాంగ్రెస్ నాయకులు నాయీ బ్రాహ్మణుల వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారో లేదో వివరణ అడిగితే రెచ్చిపోయి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. కర్రె వెంకటయ్య మచ్చలేని నాయకుడని ఆయన రెండు సార్లు సర్పంచ్ గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా గెలుపొందడమే కాకుండా 2001 నుంచి బిఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడిగా కొనసాగుతున్నారని అన్నారు. పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి పని చేసే నాయకుడని, దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. మీతో మాట్లాడిస్తున్న మీ నాయకుడి పరిస్థితి ఒక్కప్పుడు ఎలా ఉండేదో అందరికి తెలుసని, తెచ్చిన అప్పు కట్టలేక దాచుకుని తిరిగే వాడు కాదా అని ప్రశ్నించారు. పాలను అమ్ముకుని సాధారణ జీవితాన్ని గడిపిన మీ నాయకుడికి తక్కువ సమయంలోనే కొన్ని కోట్ల ఆస్తి, ఖరీదైన కార్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. అక్రమంగా భూములను కొల్లగొట్టి కబ్జాకు పాల్పడి సంపాదించిన విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసన్నారు. అధికారంలో ఉన్నామని మరోసారి ఇష్టమొచ్చిన్నట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, విమర్శలు వస్తే ప్రతి విమర్శలు చేసే సమయంలో ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. కొండపైన వర్తక వ్యాపారుల వద్ద మీ నాయకుడు డబ్బులు తీసుకున్నాడో లేదో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవుడి పైన ప్రమాణం చేసి చెప్పాలని, నాయీ బ్రాహ్మణుల వద్ద నుంచి డబ్బులు తీసుకున్న సంగతి పట్టణంలో కొడై కూస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ఆరె శ్రీధర్ గౌడ్, ఆవుల సాయి, సయ్యద్ బాబా, బండి వాసు, దండబోయిన వీరేష్, సూదగాని శ్రీకాంత్, గ్యాదపాక క్రాంతి, గుండ్లపల్లి వెంకటేష్, గౌడ శ్రీశైలం, ఒగ్గు మల్లేష్, ఆకుల శేఖర్, సర్ధార్ సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.