సంస్కృత భాష భారత జాతి ఆత్మ భాష
"సాహిత్య కళా విభూషణ్",
చౌడూరి నరసింహారావు
పత్రికా రచయిత, విశ్లేషకులు

యావత్ భారతదేశానికి ఆత్మీయ భాష ఏదైనా ఉంది అంటే అది సంస్కృత భాష మాత్రమే. ఒకరి భాషను ఒకరు నేర్చుకోవడం అనేది దేశ సమైక్యతను చాటడం, పరస్పర గౌరవాలను ప్రకటించడం, పరస్పరం విజ్ఞానాన్ని పంచుకోవడం కోసం చాలా అవసరమే. అయితే అన్ని భాషలు సంస్కృతాన్ని మాతృ స్థానంలో ఉంచి గౌరవించినవి. కొందరు ప్రాంతీయ భాషాభిమానులు సంకుచిత ధోరణిలో ఇతర భాషల ప్రభావాన్ని భరించలేక తమ భాష ఔన్నత్యం పెంచుకోవడం కోసం సంస్కృతం మీద బురద జల్లడం సంస్కృతాన్ని నిరసించడం కనిపిస్తుంది. సంస్కృతం అనగానే అదేదో ఆస్తిక భాష, మత భాష అనే అభిప్రాయం ఉన్నవారు తమ నాస్తిక భావాల అభివృద్ధికి సంస్కృతం అడ్డంకి అని భావించడమూ కనిపిస్తుంది. ఈ రెండు రకాల భావజాలం కలిగిన వారు సంస్కృతాన్ని నిర్మూలించాలని నినాదాలు చేయడం ఆశ్చర్యం కలగక మానదు. దీనికి తోడు భారతదేశం మీద సాంస్కృతికంగా విజయం సాధించే ఉద్దేశంతో పాశ్చాత్య దేశాలు పాశ్చాత్య భావ ప్రేరితులు చేసిన ప్రయత్నాల్లో ఒకటి సంస్కృతాన్ని మృత భాష అని ముద్రలు వేయడం. చివరికి ప్రభుత్వాలు కూడా తమ తమ రాజకీయ లబ్ధుల కోసం భారతీయేతర భాషలకు అగ్ర పీఠాలు, ప్రత్యేక ప్రతిపత్తులు కేటాయిస్తున్నాయి. ఓ ఐదు నిమిషాలు రేడియో,టీవీల్లో వార్తలు వినిపించడంతో సంస్కృత భాష సేవ చేశామని చేతులు దులుపుకుంటున్నారు. అయితే మన నిర్లక్ష్యం వల్ల మనం ఎలాంటి గొప్ప నిధిని పోగొట్టుకుంటున్నామో తెలుసుకోలేకపోతున్నాం. ఈ దేశాన్ని అంతటినీ ఏక సూత్రంగా కూర్చిన సంస్కృతికి మూలాధారం సంస్కృత భాషేనని కాస్తా ఆలోచిస్తే అర్థమవుతుంది. ఎంతగా ప్రాంతీయ భాషల్లోకి తర్జుమాలు చేసుకున్నా ఇంకా అందజేయవలసిన సంస్కృత సాహిత్యం అనంతంగా ఉంది.
వైజ్ఞానిక శాస్త్రీయ లక్షణం కలిగి ఉన్న ఏకైక భాష
సంస్కృత భాష జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో ఉన్నత స్థాయిలో ఆదరింపబడుతుంది. సంస్కృత ప్రాధాన్యం ఉన్న దేశాల్లో మన దేశం మూడో స్థానంలో ఉంది. మన దైవభాష జర్మనీ లాంటి దేశాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నేర్చుకోవలసిన "నిర్బంధ విద్య"గా బోధింపబడుతోందన్న విషయం మనం గమనించాలి. ఇక ఆధ్యాత్మికంగా సంస్కృతం మంత్ర భాష. నాద శక్తి రహస్యాలను తనలో దాచుకున్న భాష. వర్ణ క్రమం మొదలుకొని వ్యాకరణ నిర్మాణం వరకు నాగరిక భారతీయ భాషలన్నీ సంస్కృతాన్ని అనుసరించాయి. వైజ్ఞానిక శాస్త్రీయ లక్షణం ఉన్న ఏకైక భాష సంస్కృత భాష మాత్రమే. ఏ పదం ఎందుకు పుట్టిందో ఎలా పుట్టిందో చెప్పగలిగిన భాష సంస్కృత భాష మాత్రమే. 'వ్యుత్పత్తి' అనేది ఈ భాషకు ఉన్న ప్రత్యేక లక్షణం. అతి సులభంగా నేర్చుకోగలిగే భాష కనుక ఒకప్పుడు రాజభాష అయ్యింది. ఇప్పటికీ మన భాషలన్నింటిలో కలిసిపోయి 'ఒళ్ళో చేర్చుకొని లాలించే అమ్మలా..' ఉండిపోయింది. సంస్కృతం అవైదిక అనార్ష భావ ప్రచారం నిరాటంకంగా సాగేందుకు భౌతిక నాస్తిక వాద ప్రభావితులైన అధినేతలు సంస్కృతాన్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఈ జీవ, దైవ భాషను ఎవరూ నిర్మూలించలేరు. రామా, కృష్ణా, శివా.. అని గళం ఎత్తే ఆస్తికుడి మంత్రపాసనలో ప్రార్థనలో సంస్కృతం జీవిస్తుంది. పదమెత్తి లయవేసే నర్తకుడి భంగిమల్లో.. గళమెత్తి పాడే సామగానంలో సంస్కృత శక్తి ధ్వనిస్తూనే ఉంటుంది. పూలదండలో దారంలా మనందరిలో జీవించే ఉంది సంస్కృతం. దానిని గుర్తించి అధ్యయనం చేస్తే అపారమైన భారతీయ వాఙ్మయమంతా అవగాహన చేసుకోవచ్చు. ఆ నిధిలో నిక్షిప్తమైన విలువైన రత్నాలను వెలికి తీసుకోవచ్చు. ఇంత అపారమైన వాఙ్మయం ఏ భాషలోనూ లేదనే విషయాన్ని ఘంటాపథంగా చెప్పవచ్చు.
పునాదిలేని భవన నిర్మాణం ప్రమాదం
సంస్కృత భాషను వదులుకుంటే మన ఆత్మ ని మనం పోగొట్టుకున్నట్లే. మనలో భారతీయత సంపూర్ణంగా ప్రకటితం కావాలంటే మన అమ్మ భాషతో కలిసి సంస్కృతం మన నోట పలకాలి. అది లేకుండా ప్రపంచాన్నంతా అధ్యయనం చేసినా అది పునాదిలేని భవన నిర్మాణం లాంటిదే అవుతుంది. సాధారణంగా ఇలాంటి ప్రబోధ వాక్యాలు విన్నాక 'ఛాదస్తం' అని దులిపేసుకునేటంత మొద్దు బారుడుతనం మనకి ఏనాడో సంక్రమించింది. ముఖ్యంగా తెలుగు వారికి. తెలుగు మాట పలకడానికే సిగ్గుపడే ఆత్మహీనులు, వెన్నుముక లేని ప్రబుద్ధులు ఉన్న కాలంలో ఏకంగా సంస్కృత భాష గురించి చెప్పడం సాహసోపేతమే అవుతుంది. కానీ ఎక్కడో అణగారి ఉన్న వివేకం ఎప్పుడైనా మేలుకొనదా? అనే ఆశ. మనదై ఉండి మనం గుర్తించని ఒక మహా నిధి గురించి మళ్లీ మళ్లీ మననం చేసుకొని, ఆ దిశగా మన సంస్కారాలను మలుచుకోవాలనే ఆర్తితో నా ఈ ఆత్మీయ విన్నపం. నిజానికి తెలుగు భాష సంస్కృతాన్ని భావమయం చేసుకుంది. వేద పపఠనం యథాతథంగా, సుస్వరంగా చదవగలిగేది తెలుగువాడు ఒక్కడే! అలాంటిది విద్యా విధానాల్లో పెరిగిన సంస్కృతి పట్ల అనాదరణ, రాజకీయాల జోక్యం, ఆధునిక యాంత్రిక జీవన గమనం ఈ రెండు భాషల విలువలను నేటి తరానికి తెలియనీయకుండా చేస్తున్నాయి. భాషావేత్తల కొలబద్దలలో ఒదగడానికి సంస్కృతం ఒక భాష కాదు. ఒక మహా శక్తి. ఆ మహా శక్తిని ఇకనుండి అయినా మనం సముపార్జించుకుందాం! భారత్ ను మరల గురు స్థానంలో నిలబెడదాం!
"సాహిత్య కళా విభూషణ్",
చౌడూరి నరసింహారావు
పత్రికా రచయిత, విశ్లేషకులు
