పారదర్శకంగా డిసిసి అధ్యక్షులు నియామకం
భూపాలపల్లి జిల్లా :
- నూతన కమిటీలతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం
- కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా కలిసికట్టుగా కృషి చేద్దాం
- డిసిసి అధ్యక్షుల అబ్జర్వర్ అబ్రహం జాన్సన్

డిసిసి అధ్యక్షుల నియామకాన్ని పారదర్శకంగా నియమించేందుకు గాను కాంగ్రెస్ పార్టీ అందరి అభిప్రాయాలతో ముందుకు వెళ్తుందని ఏఐసీసీ నేత, డిసిసి అధ్యక్షుల అబ్జర్వర్ అబ్రహం జాన్సన్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసీసీ అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన సోమవారం డిసిసి అధ్యక్షుల ధరఖాస్తుల స్వీకరణ, నియామక అభిప్రాయాలపై నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అబ్రహం జాన్సన్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా డీసీసీ అధ్యక్షుల నియామకంపై దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు. ఇందులో పార్టీ కోసం పని చేసే ముఖ్య నేతలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలియజేశారు. క్షేత్రస్థాయిలో పూర్తి విచారణ చేపట్టి, అందరి అభిప్రాయాలు సేకరించి పారదర్శకంగా అధ్యక్షుల నియామకం చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా అబ్జర్వర్లుగా తాము హాజరు కావడం జరిగిందన్నారు. డిసిసి అధ్యక్షుల నియామకాలతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కానుందని దాని ద్వారా అందరూ కలిసికట్టుగా పనిచేసి రానున్న ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.
